Sakshi News home page

సిరాజ్‌.. బౌలింగ్‌ రాదు.. ఫీల్డింగ్‌ రాదు..

Published Sat, Apr 6 2019 8:51 PM

Fans Troll RCB Pacer Mohammed Siraj  - Sakshi

బెంగళూరు : రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై ఆ జట్టు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా మండిపడుతున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే ఈ ఓటమికే సిరాజే కారణమని దుమ్మెత్తిపోస్తున్నారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డివిలియర్స్‌ చెలరేగి కొండంత లక్ష్యాన్ని నిర్ధేశించినా.. బౌలర్లు సమిష్టిగా విఫలమై మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయారు. వరుస నాలుగు ఓటములతో ఇప్పటికే కుంగిపోయిన అభిమానులు.. గెలుస్తామనుకున్న మ్యాచ్‌ కూడా చేజారడంతో మరింత అసహనానికి గురయ్యారు. ఈ ఫ్రస్టేషన్‌తో మ్యాచ్‌లో చెత్త ప్రదర్శనతో తేలిపోయిన సిరాజ్‌పై మండిపడ్డారు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సిరాజ్‌ మరి దారుణంగా విఫలమయ్యాడు. రెండు కీలక క్యాచ్‌లు జారవిడచడంతోపాటు.. దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. స్టొయినిస్‌ వేసిన 11వ ఓవర్‌లో క్రిస్‌ లిన్‌ భారీ షాట్‌ బాదగా బౌండరీ లైన్‌ వద్ద సులభమైన క్యాచ్‌ను సిరాజ్‌ నేలపాలు చేశాడు.

కానీ ఆ తర్వాతి ఓవర్లోనే నేగి... లిన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఇక 16వ ఓవర్‌లో నితీష్‌ రాణా ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను వదిలేశాడు. ఆ వెంటనే చహల్‌ రాణాను ఔట్‌ చేయడంతో మరోసారి సిరాజ్‌ బతికిపోయాడు. ఇక కీలక సమయమంలో కోహ్లి నమ్మకాన్ని వమ్ముచేశాడు. పొదుపుగా బౌలింగ్‌ చేయాల్సిన 18వ ఓవర్‌లో నిర్లక్ష్యంగా వరుస బంతుల్ని బీమర్లుగా వేశాడు. అందులో ఒకటి సిక్సర్‌గా వెళ్లింది. దీంతో అంపైర్‌ సిరాజ్‌ను తప్పించాడు. ఇది ఆర్సీబీ విజయవకాశాలను దెబ్బతీసింది. ఇదే అభిమానులకు ఎక్కడిలేని ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా సిరాజ్‌ను ఓ ఆట ఆడుకున్నారు. ఫన్నీ మీమ్స్‌ క్రియేట్‌ చేసి ట్రెండ్‌ చేశారు. మరికొందరైతే అసలు నీవు ఐపీఎల్‌ స్థాయి క్రికెటర్‌వా? లేక గల్లీ క్రికెట్‌ర్‌వా? అని మండిపడ్డారు. ‘బౌలింగ్‌ రాదు.. ఫీల్డింగ్‌ రాదు.. ఎందుకయ్యా నీవు జట్టులో ఉండి’  ఇంకొకరు కామెంట్‌ చేశారు.

Advertisement
Advertisement